ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టకుండా, అనవసరమైన అంశాలతో రాజకీయాలు చేయడం సరికాదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా అందలేదని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
అప్పుడు మౌనంగా ఉన్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రధాని మోడీ ఫొటోలను రేషన్ కార్డులపై ముద్రించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. “ప్రధాని మోడీ ఫొటో లేకపోతే ఉద్యమం చేస్తామనడం వారి విద్వేశ రాజకీయ ఆలోచనలకు నిదర్శనం.
దేశాన్ని, పదవులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు, ఈ విషయంలో మాకు ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు. మేము ప్రజా సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేశాం, కానీ ఇలాంటి అర్థం లేని డిమాండ్ల కోసం కాదు” అని ఆయన స్పష్టం చేశారు.
