HomeTelanganaNizamabadఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు చేయాలినిజామాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు చేయాలినిజామాబాద్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంకుల్లో ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు శుక్రవారం దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్ బీఐ) పిలుపు మేరకు నిజామాబాద్‌ జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన సుమారు వెయ్యి మంది ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించి సమ్మె చేశారు.

దీంతో బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ జాప్యం చేస్తున్నాయని సంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆర్‌బీఐ, నాబార్డ్‌, సెబీ, ఎల్‌ఐసీ తదితర సంస్థల్లో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉందని, బ్యాంకులకు కూడా అదే విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా బ్యాంకు ఉద్యోగులపై పని భారం తగ్గడం లేదని నాయకులు పేర్కొన్నారు. పని వేళలు ముగిసిన తర్వాత కూడా పెండింగ్‌ పనులు పూర్తి చేయాల్సి వస్తోందని, సెలవు రోజుల్లోనూ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యోగుల పని–జీవిత సమతుల్యత కోసం ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.

బ్యాంకుల లాభాల్లో ఉద్యోగుల కృషి కీలకమని పేర్కొంటూ అందరికీ సమానంగా, పారదర్శకంగా న్యాయమైన పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) అందించాలని డిమాండ్‌ చేశారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి సిబ్బందిపై ఉన్న అదనపు పనిభారాన్ని తగ్గించాలని కోరారు. ఎన్‌పీఎస్‌ స్థానంలో పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని, పెన్షన్‌ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వైద్య బీమా భారాన్ని తగ్గించడంతో పాటు గ్రాట్యుటీ పెంపు, ఎన్‌పీఎస్‌లో అదనంగా జమ చేసే నాలుగు శాతం చందాపై ఆదాయపు పన్ను మినహాయింపు, పెన్షన్‌ అప్‌డేషన్‌ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు.సమ్మె వల్ల ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, అయితే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని నాయకులు తెలిపారు.

సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఈ నెలాఖరులో మూడు రోజుల సమ్మె, అక్టోబరులో నిరవధిక సమ్మె చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.సమ్మెను విజయవంతం చేసిన ఉద్యోగులు, అధికారులతో పాటు సంఘీభావం తెలిపిన ఇతర ట్రేడ్‌ యూనియన్లకు యూఎఫ్ బీఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

యూఎఫ్ బీఐ నిజామాబాద్‌ యూనిట్‌ కన్వీనర్‌ ఎం.వి. రమేష్‌, గురునాథ్‌, రాజు, మనోజ్‌ సింగ్‌, వంశీ, సందీప్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments