పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హోటల్ వ్యాపారిపోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఓ హోటల్ వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన సోమవారం భీంగల్‌లో తీవ్ర కలకలం రేపింది. భీంగల్ పట్టణానికి చెందిన పొలాస సుధాకర్ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇటీవల రాత్రి నిర్ణీత సమయం దాటిన తర్వాత హోటల్ తెరిచి ఉంచారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అక్కడే న్యాయపరంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. అయితే తన హోటల్‌పై మాత్రమే పోలీసులు చర్యలు తీసుకున్నారని, ఇతర హోటళ్లు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారనే మనస్తాపంతో పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
అప్పటికే సుధాకర్ శరీరంలో కొంత భాగం కాలిపోయింది. ఘటనను గమనించిన ఎస్సై వెంటనే అంబులెన్స్ రప్పించి, తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
