HomeCRIMEవిలేజ్ డెవలప్‌మెంట్ కమిటీల ముసుగులో అరాచకాలు..గ్రామాభివృద్ధి పేరుతో ఆంక్షలు.. జరిమానాలు.. సామాజిక బహిష్కరణలు...నిజామాబాద్‌లో వీడీసీల తీరుపై...

విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీల ముసుగులో అరాచకాలు..గ్రామాభివృద్ధి పేరుతో ఆంక్షలు.. జరిమానాలు.. సామాజిక బహిష్కరణలు…నిజామాబాద్‌లో వీడీసీల తీరుపై బీసీ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం

నిజామాబాద్‌ జిల్లాలో కొన్ని గ్రామాల్లో వీడీసీల మాటే చట్టంగా మారిందని బీసీ కమిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరిని గ్రామంలో ఉంచాలి.. ఎవరిని బహిష్కరించాలి.. ఎంత జరిమానా విధించాలి.. అనే నిర్ణయాలను సైతం వీడీసీలే తీసుకుంటున్న పరిస్థితులు తమ ప్రత్యక్ష విచారణలో వెలుగుచూశాయని కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు.

గ్రామాల్లో వీడీసీలు చెప్పిందే వేదం, వారు విధించిందే శిక్ష అన్నట్లుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.నిజామాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతమవుతున్న నేపథ్యంలోనే మరోసారి స్వయంగా విచారణకు వచ్చామని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు.

బుధవారం సామాజిక బహిష్కరణ ఉదంతాలపై తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈమేరకు కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలో సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మిలతో కూడిన బృందం బుధవారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధితులతో భేటీ అయ్యారు.

92 మంది వినతి పత్రాలు అందజేశారని తెలిపారు అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…
గ్రామంలో ఎవరితో మాట్లాడాలి.. ఎవరితో మాట్లాడకూడదు.. ఎవరి దుకాణంలో సరుకులు కొనాలి.. ఎవరికి సహకరించాలి.. అన్నదీ వీడీసీలే నిర్ణయించే పరిస్థితి నెలకొంటే ఇక గ్రామంలో చట్టం, అధికార యంత్రాంగం పాత్ర ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోందని నిరంజన్‌ అన్నారు.

వీడీసీలు గ్రామాభివృద్ధికి పనిచేయడంపై ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ అదే పేరుతో ప్రజలపై ఆంక్షలు విధించడానికి, జరిమానాలు వేయడానికి, సామాజిక బహిష్కరణలకు పాల్పడటానికి హక్కు లేదని స్పష్టం చేశారు. వీడీసీల ఆధిపత్యం, సామాజిక బహిష్కరణలపై గతంలోనే జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయని కమిషన్‌ గుర్తుచేసింది.

ఒకే తరహా ఘటనలు మళ్లీ మళ్లీ చోటుచేసుకోవడంపై కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 2025లో మునిపల్లి గ్రామానికి చెందిన వీడీసీ సభ్యులకు సామాజిక బహిష్కరణ కేసులో కోర్టు శిక్ష విధించిన విషయం కూడా నమోదైంది.

అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోందని కమిషన్‌ అభిప్రాయపడింది.

ఎమ్మెల్యేనూ బహిష్కరించారట!

వీడీసీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు గతంలో ఓ ఎమ్మెల్యేను సైతం గ్రామ బహిష్కరణ చేసిన ఘటనను నిరంజన్‌ ప్రస్తావించారు. ప్రజాప్రతినిధికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యులు ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. అయితే ఆ ఘటనకు సంబంధించిన వ్యక్తి పేరు వెల్లడించలేదు.

92 మంది బాధితుల గోడు

వీడీసీల వ్యవహారాలపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కమిషన్‌ సభ్యులు సుమారు 92 మంది బాధితులతో ముఖాముఖి మాట్లాడినట్లు నిరంజన్‌ తెలిపారు. ఎలాంటి భయం లేకుండా తమ బాధలు చెప్పుకునే అవకాశం కల్పించామని, వారి వాంగ్మూలాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమైందన్నారు.

వీడీసీ ఆదేశాలను పాటించకపోతే సామాజికంగా దూరం చేయడం, జరిమానాలు విధించడం, జీవనోపాధికి అడ్డంకులు సృష్టించడం వంటి విషయాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు.

‘గ్రామాభివృద్ధి’ పేరుతో పెత్తనం వద్దు

గ్రామాభివృద్ధి కమిటీలు అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలని నిరంజన్‌ స్పష్టం చేశారు. వీడీసీ పేరుతో డబ్బులు వసూలు చేయడం, ప్రజలపై ఆంక్షలు విధించడం, సామాజిక బహిష్కరణలు చేయడం చట్టపరంగా సమర్థనీయం కాదన్నారు.

అలాంటి ఘటనలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే అది పరిపాలనా వైఫల్యంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లాలో వీడీసీల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ను కోరినట్లు నిరంజన్‌ తెలిపారు.

చట్టాలు, హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు చెప్పారు.

బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం, పౌరహక్కుల పరిరక్షణ చట్టం ఉన్నట్లే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరమని కమిషన్‌ భావిస్తోందన్నారు. బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని కమిషన్‌ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిందని, త్వరలో ఈ దిశగా చర్యలు ఉండే అవకాశం ఉందని నిరంజన్‌ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments