నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం డీకంపల్లి గ్రామంలో ఒకే రోజు రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు బీరువాలను ధ్వంసం చేసి బంగారం, వెండి వస్తువులతో పాటు నగదును అపహరించారు.
రెండు ఘటనలపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం సంఘటనా స్థలాలను పరిశీలించింది. మాక్లూర్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుమన్పల్లి బాబు తన భార్య ప్రసవం కోసం నాలుగు రోజులుగా నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంటున్నారు.
ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు మంగళవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మరో గదికి వేసిన తాళంతో పాటు బీరువా, అందులోని అల్మారాను ధ్వంసం చేశారు. బాబు తులం బంగారు గొలుసు, ఆయన భార్య, కుమార్తెకు చెందిన 10 తులాల వెండి వస్తువులు, తల్లి బంగారు పుస్తెలు, ప్రసవ ఖర్చుల కోసం తెచ్చి పెట్టుకున్న రూ.50 వేల నగదును ఎత్తుకెళ్లారు.
అదే గ్రామానికి చెందిన కొండ్ర సాయికుమార్ ఏడాది కాలంగా తన సొంత ఇంటికి తాళం వేసి నిజామాబాద్లో అద్దెకు ఉంటున్నారు. గత వారం ఇంటికి వచ్చినప్పుడు వస్తువులన్నీ సక్రమంగానే ఉన్నాయి. బుధవారం ఇంటి ముందు నుంచి వెళ్తున్న గ్రామ కారోబార్ రమేష్ తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి సాయికుమార్కు సమాచారం ఇచ్చారు.
ఆయన వచ్చి చూడగా రెండు బీరువాలు ధ్వంసం చేసి ఉన్నాయి. వాటిలో దాచిన రెండు తులాల బంగారు వస్తువులు, తులం వెండి వస్తువులు, తల్లి దాచుకున్న రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు.
బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఒకే గ్రామంలో రెండు ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చోరీలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు.పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
