అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో గురువారం శ్రీ దుర్గా దేవి సేవా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో కొలువుదీరిన అమ్మవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
శరన్నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధించే సంప్రదాయంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు సామూహికంగా పూజల్లో పాల్గొని అమ్మవారికి కుంకుమ సమర్పించారు.
వేదమంత్రాలు, భక్తి భావంతో సాగిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబుతో పాటు సంస్థ ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
