విధి నిర్వహణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలోనూ ముందుంటామని చాటారు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకాపూర్ గ్రామంలోని లాలన వృద్ధాశ్రమాన్ని గురువారం సందర్శించి అక్కడి వృద్ధులతో ఆప్యాయంగా గడిపారు.
సుమారు 60 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి దుస్తులు పంపిణీ చేసి, స్వయంగా భోజనం వడ్డించారు.వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వారి ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, రోజువారీ జీవన పరిస్థితుల గురించి కమిషనర్ ఆరా తీశారు.
ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే శారీరక, మానసిక ఇబ్బందులను ఓపికగా విని, వారికి అండగా ఉంటామనే భరోసా కల్పించారు. పోలీస్ కమిషనర్ స్వయంగా వచ్చి పలకరించడం, దుస్తులు అందించి భోజనం వడ్డించడంతో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు.వృద్ధుల అనుభవాలను గౌరవిస్తూ, వారి అవసరాలను గుర్తించి సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు.
వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజం నుంచి ప్రేమ, ఆప్యాయత, గౌరవం, మానసిక ధైర్యం ఎంతో అవసరమన్నారు. వృద్ధుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, వారి మాటలను ఓపికగా విని అండగా నిలవాలని సూచించారు.
సమాజంలోని సమస్యలను అర్థం చేసుకోవాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకుని వారి పరిస్థితులను తెలుసుకోవాలని పేర్కొన్నారు.వృద్ధుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వైద్య సలహాలు, సూచనలు అందించారు.
పోలీసు శాఖ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మానవీయ విలువలు, సేవాభావం, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తోందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్రెడ్డి, భీంగల్ సీఐ సత్యనారాయణగౌడ్, ఆర్మూర్ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, వైద్యులు డాక్టర్ శంకర్, డాక్టర్ మధుశేఖర్, డాక్టర్ వంశీ, డాక్టర్ ముత్యంరెడ్డి, డాక్టర్ లింగారెడ్డి, డాక్టర్ ధనపాల్ సదన్, వృద్ధాశ్రమ నిర్వాహకులు సునీత, నాగమణి, దామోదర్రెడ్డి, సంకీత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
