HomeCRIMEఎన్నికల ‘హామీ’ కోసం 600 కుక్కల నరమేధం విషపు ఇంజక్షన్లు ఇచ్చి దారుణంగా హతమార్చిన వైనం..

ఎన్నికల ‘హామీ’ కోసం 600 కుక్కల నరమేధం విషపు ఇంజక్షన్లు ఇచ్చి దారుణంగా హతమార్చిన వైనం..

ఐదుగురు సర్పంచులు, కార్యదర్శులపై కేసు నమోదు “మనిషి తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడని నిరూపించే ఘటన ఇది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఏకంగా 600 మూగజీవుల ప్రాణాలను బలితీసుకున్న అమానుషం కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.

మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్వంచ, ఫరీద్ పేట,బండ రామేశ్వర్ పల్లి,వాడి, భవానిపేట్ ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 600 వీధి కుక్కలను విషపు ఇంజక్షన్లు, గుళికలు ఇచ్చి అత్యంత క్రూరంగా చంపి పాతిపెట్టారు. ఈ ఉదంతం జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

జంతు ప్రేమికుల కథనం ప్రకారం.. గత సర్పంచ్ ఎన్నికల సమయంలో ‘గ్రామాలను కుక్కల బెడద నుంచి విముక్తి చేస్తాం’ అని హామీ ఇచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఈ అమానుషానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

దీంతో సమాచారం అందుకున్న ‘స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ఆనవాళ్లు సేకరించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు.. జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టిన కుక్కల మృతదేహాలను వెలికితీశారు. వెటర్నరీ వైద్యులు అక్కడికక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ మేనేజర్ మాట్లాడుతూ.. “గ్రామాల్లో కుక్కల వల్ల ఇబ్బంది ఉంటే వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించాలి లేదా రేబిస్ టీకాలు వేయించాలి తప్ప, ఇలా విషమిచ్చి చంపడం చట్టరీత్యా నేరం.

ఎన్నికల హామీల కోసం నోరులేని జీవులను బలి తీసుకోవడం అత్యంత విచారకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాచారెడ్డి ఎస్సై అనిల్ స్పందిస్తూ.. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద ఐదు గ్రామాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ప్రాథమిక విచారణలో పంచాయతీ అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలిందని, పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments