వసంత పంచమి ఉత్సవాలకు ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ముస్తాబైంది. విద్యుత్ కాంతుల వెలుగులతో ఆలయం దగదగ మెరిసి భక్తుల హృదయాలను పరవశింపజేస్తోంది.
మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ వేడుకల కోసం దేవస్థానం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో నే కాక ఉప ఆలయాలు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అతిథి గృహాలు విద్యుత్ దీపాలతో కాంతివంతంగా అలంకరించబడ్డాయి.
ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేసిన స్వాగత (తోరణాలు) భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి.
రాత్రి వేళల్లో ఈ విద్యుత్ దీపాల అలాంకరణలు విశిష్టంగా ప్రకాశించి, ఉత్సవ వాతావరణాన్ని మరింత ప్రభావవంతంగా మార్చాయి.
ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తుల రాకపోకలు ఉంటాయని అంచనా వేసి, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యాలు వంటి అన్ని ఏర్పాట్లను అధికారులు చక్కగా అమలు చేస్తున్నారు.
అమ్మవారి ఆశీస్సులతో విద్యార్ధులు, భక్తులంతా జ్ఞాన ప్రాప్తిని పొందాలని కోరుకుంటూ ఈ వసంత పంచమి వేడుకలు ఘనంగా సాగనున్నాయి.
