మత్తు పదార్థాలకు బానిసలవ్వొద్దు.. రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ ప్రాణాలను కాపాడుకోండి అంటూ నిజామాబాద్ పోలీస్ కళాబృందం విద్యార్థులకు హితబోధ చేసింది.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, నగరంలోని 5వ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీజీఎంఆర్జేసీ నాగారం బాలుర కళాశాలలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాబృందం సభ్యులు నాటికలు, పాటల రూపంలో మత్తు పదార్థాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. యువతకు అవేర్నెస్ కల్పిస్తూ వారు చేసిన ప్రదర్శనలు విద్యార్థులను ఆలోచింపజేశాయి.
వాహనదారులు హెల్మెట్ ధరించడం అనేది బరువు కాదని, అది ప్రతి ఒక్కరి బాధ్యతని, రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తేనే సురక్షితంగా ఉంటామని పోలీసులు సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి హెచ్చరించారు.
ఆటో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి ప్రమాదకరమని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
గ్రామాలు, పట్టణాల్లో ఎలాంటి గొడవలకు తావులేకుండా పండగలను స్నేహపూర్వకంగా జరుపుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు డైల్ 100 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 5వ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన విద్యార్థి దశే భవిష్యత్తుకు పునాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల టీచర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
