HomeTelanganaNizamabadపసుపు బోర్డు ఉంటే సరిపోదు.. మద్దతు ధర ప్రకటించాలి! కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు...

పసుపు బోర్డు ఉంటే సరిపోదు.. మద్దతు ధర ప్రకటించాలి! కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు..నిజామాబాద్ మార్కెట్‌ను సాఫ్ట్‌వేర్‌లో చేర్చకపోవడం బీజేపీ కుట్ర..అమెరికాతో వాణిజ్య ఒప్పందం రైతులకు శాపం: డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరి వల్లే పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నగేష్ రెడ్డి ధ్వజమెత్తారు.

గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ పాయింట్ టూ (0.2) విధానంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల వల్ల రైతులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

దేశంలోనే అతిపెద్దదైన నిజామాబాద్ పసుపు మార్కెట్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని నగేష్ రెడ్డి విమర్శించారు. గతంలో ఉన్న సాఫ్ట్‌వేర్ కాంట్రాక్టర్ గడువు ముగియడంతో, కొత్తగా ప్రవేశపెట్టిన 0.2 సాఫ్ట్‌వేర్‌లో నిజామాబాద్ మార్కెట్‌ను చేర్చకపోవడం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందన్నారు.

“పసుపు బోర్డు నిజామాబాద్‌లోనే ఉందని గొప్పలు చెప్పుకుంటున్న ఎంపీ అరవింద్.. మరి మార్కెట్‌ను సాఫ్ట్‌వేర్‌లో ఎందుకు చేర్చలేకపోయారు?” అని ఆయన నిలదీశారు. కేవలం బోర్డు ఏర్పాటుతో ఉపయోగం లేదని, పసుపుకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే రైతుకు నిజమైన మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.

తాను 2004 నుండి 2014 వరకు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించానని నగేష్ రెడ్డి గుర్తు చేశారు. మహారాష్ట్రలోని సాంగ్లీ, తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్ల కంటే నిజామాబాద్‌లో మెరుగైన ధర వచ్చేలా అప్పట్లో చర్యలు తీసుకున్నామన్నారు.

2009లో తులం బంగారం ధర రూ. 18 వేలు ఉన్నప్పుడు, క్వింటాల్ పసుపుకు రూ. 17 వేలు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నగేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అమెరికాలో ఎకరాకు 80 క్వింటాళ్ల దిగుబడి వచ్చే మొక్కజొన్నను జీరో టాక్స్‌తో దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడి రైతులకు గిట్టుబాటు ధర దక్కకుండా పోతోందని విమర్శించారు.

ఈ ప్రజా వ్యతిరేక ఒప్పందాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రైతులను రోడ్ల మీదకు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం బీజేపీ నేతలకు తగదని హితవు పలికారు.

ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంతరం పర్యవేక్షిస్తూ సాంగ్లీ మార్కెట్ స్థాయి ధరలు ఇక్కడ వచ్చేలా కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్రం వెంటనే తన మొండివైఖరి వీడి సాఫ్ట్‌వేర్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


ఈ సమావేశంలో డీసీసీ కోశాధికారి భక్తవస్తలం, ఉపాధ్యక్షులు శరత్ కుమార్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, కార్పొరేటర్లు ప్రవీణ్ గౌడ్, చరణ్, గంగాధర్, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments