సమాజంలో బంధుత్వాలు కనుమరుగవుతున్న వేళ, మానవత్వమే మిన్న అని నిరూపించింది నిజామాబాద్ జిల్లాకు చెందిన ‘ఇందూరు యువత’ స్వచ్ఛంద సేవా సంస్థ. ఎవరూ లేని ఓ అనాథ మృతదేహానికి కన్న బిడ్డల వలె దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నారు.
ఆర్మూర్ పట్టణంలో ఓ వ్యక్తి అనాథగా మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని స్థానిక పోలీసు సిబ్బంది ఇందూరు యువత సంస్థను కోరారు. పోలీసుల విన్నపానికి తక్షణమే స్పందించిన సంస్థ ప్రతినిధులు, ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు.
గురువారం ఆర్మూర్ లోని దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక్ శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరణించిన వ్యక్తికి ‘నా’ అనే వారు లేకపోయినా, తామే వారమై అన్ని తానై ఆ యువకులు అంతిమ యాత్రను పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, తిరుమల శ్రీనివాస్, గంగారాం, ఆర్మూర్ పోలీస్ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు. దిక్కులేని శవానికి అండగా నిలిచిన యువతను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
