HomeLaw and Orderఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి..ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా...

ఎల్ నినో నేపథ్యంలో ఆరుతడి పంటలనే సాగు చేయాలి..ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి..ఖరీఫ్ పంటను గట్టెక్కిస్తాం…రబీలో మాత్రం వరి వేస్తే కాపాడలేం

ఆరుతడి సాగుకు అన్నివిధాలుగా తోడ్పాటును అందిస్తాం

కొత్తగా బోరుబావులు తవ్విస్తే సీజ్ చేస్తామని స్పష్టీకరణ

నిజామాబాద్, అక్టోబర్ 27 : ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు రబీలో ఆరుతడి పంటలనే సాగు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు.

అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా తదితర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

ఒకవేళ వరి మినహా ఇతర పంటల సాగుకు చౌడు భూములు వంటి నేల రకాలు సహకరించకపోతే క్రాప్ హాలిడే పాటించాలని, వరి సాగు మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు.
నందిపేట మండలం నూత్ పల్లి రైతు వేదికలో మంగళవారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులనుద్దేశించి మాట్లాడారు. ఖరీఫ్ లో వేసిన వరి పంట పూర్తి స్థాయిలో చేతికి అందేంత వరకు జిల్లా యంత్రాంగం తరపున కాపాడుతామని రైతులకు భరోసా కల్పించారు. అయితే రబీలో మాత్రం వరి పంటకు సాగు నీరు అందించే పరిస్థితి ఉండదని కలెక్టర్ వెల్లడించారు.

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ప్రతీకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై రైతులకు కీలక సూచనలు చేశారు. వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పెసలు, మినుములు, శనగతో పాటు జొన్న, మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటల సాగును చేపట్టడం ఎంతో శ్రేయస్కరమని రైతులను ప్రోత్సహించారు.

బిందు సేద్యాన్ని వినియోగించుకొని ఆయిల్‌పామ్ తోటలు, కూరగాయలు తదితర పంటలను సాగు చేయడం ద్వారా నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని అన్నారు. ఆరుతడి పంటల సాగుకు ముందుకు వచ్చే రైతాంగానికి ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరఫున తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు. మల్చింగ్, బిందు సేద్యం విధానాలకు రాయితీ వర్తించేలా ప్రణాలికలు రూపొందిస్తామని అన్నారు.

కూరగాయలు, ఇతర ఆరుతడి పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే దిశగా కూడా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వీబీజీరాంజీ కింద ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, బోరు బావుల రీఛార్జ్ వంటి పనులను చేపట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవడంపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొత్తగా బోరుబావులు తవ్వకూడదని, ఎవరైనా తవ్విస్తే వాటిని సీజ్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.


ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయని, రానున్న రోజుల్లో సేద్యానికి కరెంటు సరఫరాకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, యాసంగిలో వరి సాగు చేసి ఇబ్బందుల్లో పడవద్దని జిల్లా పాలనాధికారి హితవు పలికారు.

ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు సైతం రబీలో రైతులు ఆరుతడి పంటలే సాగు చేసేలా విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ వారికి అవగాహన కల్పించాలని అన్నారు.


ఈ సందర్భంగా ఆదర్శ రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రబీలో ఏ తరహా పంటలు సాగు చేయవచ్చు, కరువు పరిస్థితులను అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటీ తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు రైతులకు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ రావు, ఉద్యానవన శాఖ అధికారిణి సంధ్య, సర్పంచ్ రాజిరెడ్డి, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments