చిన్నారులు, విద్యార్థులు నిరంతరం అప్రమత్తతతో ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్‌కుమార్ సుబేదార్ సూచించారు.
నగరంలోని గంగస్థాన్లో గల వివేకానంద ఆడిటోరియంలో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వివేక్ సంస్కార్’ వేసవి శిక్షణ శిబిరంలో మంగళవారం విద్యార్థులకు బాలల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజ్‌కుమార్ సుబేదార్ మాట్లాడుతూ.. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో బాలబాలికలు మానవ శరీరంపై, ముఖ్యంగా ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
అనుమానాస్పద వ్యక్తుల వ్యవహారశైలిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు ఇచ్చే ప్రలోభాలకు లోంగిపోకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే తక్షణమే ఆ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
మైనర్ పిల్లలను వేధింపులకు గురిచేసే నిందితులపై ‘పోక్సో’ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సాంకేతికత పెరుగుతున్న తరుణంలో సెల్ ఫోన్ల వినియోగం, వాటిలోని విపరీత ధోరణుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలని కోరారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంతో ఆత్మరక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలని, ఉన్నతమైన లక్ష్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ రంజీత్ సుతారే, పారా లీగల్ వాలంటీర్ జీవన్, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు సాయిప్రసాద్, సంస్థ ప్రతినిధులు గోపాల్, దేరీన్ వసంత్, గంగాధర్, కిశోర్, న్యాయసేవా సంస్థ ప్రతినిధి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
