నిజామాబాద్ జిల్లాలో చీతా ఫోర్స్, సీసీఎస్ బృందాలు పలు మండలాల్లోని దాబాలు, మెస్‌లపై ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. జక్రాన్‌పల్లి, మాక్లూర్, ఎడపల్లి మండలాల్లో నిర్వహించిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుబడింది. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.జక్రాన్‌పల్లి మండల పరిధిలోని ఆర్డర్ల మెస్‌పై చీతా ఫోర్స్ సిబ్బంది మెరుపుదాడి చేశారు. ముందస్తు సమాచారంతో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కొంత మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మెస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మాక్లూర్ మండల పరిధిలోని నాలుగు దాబాలపై చీతా ఫోర్స్, సీసీఎస్ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. ఓ దాబాలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన నాలుగు బీరు బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలోని ఓ దాబాపై నిర్వహించిన తనిఖీలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. దాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 లీటర్ల మద్యాన్ని చీతా ఫోర్స్, సీసీఎస్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
