మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిలో గత మూడు వారాలుగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి.
నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల వివరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,శనివారం ఒ ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 13 నుండి మే 2వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 432 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
వీరందరినీ సంబంధిత కోర్టుల్లో హాజరుపరచగా, 25 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారు.మిగిలిన వారిపై మొత్తం రూ. 40,25,000/- జరిమానా విధించినట్లు తెలిపారు.డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణాపాయం కలగడమే కాకుండా, భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని సీపీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు: మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికితే డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలల పాటు రద్దు చేస్తారు.డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి పరిహారం చెల్లించవు.
మైనర్లు తాగి వాహనం నడిపితే, వారిపైనే కాకుండా వాహన యజమానిపై కూడా చార్జ్ షీట్ దాఖలు చేసి జైలుకు పంపిస్తాం. రెండోసారి పట్టుబడితే జరిమానాతో పాటు తప్పనిసరిగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపి తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని సీపీ కోరారు.
