జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, నిల్వలు, అనధికారిక బెల్ట్ షాపుల నిర్వహణపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక దాడుల వివరాలను నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 1వ తేదీన కొన్ని దినపత్రికలలో ప్రచురితమైన వార్తల నేపథ్యంలో ప్రజలకు స్పష్టతనిచ్చేందుకు ఈ వివరాలను విడుదల చేశారు.
అక్రమ మద్య నియంత్రణ కోసం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 64 కేసులు నమోదైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో 62 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశామని, వారిని చట్టప్రకారం సంబంధిత ఎమ్మార్వోల ముందు హాజరుపరిచినట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.దాడుల సందర్భంగా ఇప్పటివరకు సుమారు 300 లీటర్ల అక్రమ మద్యాన్ని జప్తు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు.
జిల్లా పరిధిలో మద్యం నిల్వ, రవాణా మరియు అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమ మద్యం రవాణాకు పాల్పడినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
