నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్ పల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జ్యోతి – సంజీవ్ దంపతులు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం పొలంలో వరి నాటు వేసి దంపతులిద్దరూ ఇంటికి వచ్చారు. ఆరుబయట బట్టలు ఆరబెట్టేందుకు భార్య జ్యోతి వెళ్ళగా ఆమె విద్యుత్ షాక్ కు గురైంది.
భర్త సంజీవ్ ఆమెను కాపాడేందుకు వెళ్లి విద్యుత్ షాక్ కి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా తల్లిదండ్రులు తమను విడిచిపెట్టి వెళ్లడంతో వారి రోదన పలువురిని కంట తడి పెట్టించింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
