ఎన్‌టీయే జారీ చేసిన కఠిన మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం అక్షరాలా అమలు చేసింది. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో 3,459 మంది అభ్యర్థులకు గాను 2,994 మంది (86.55 శాతం) హాజరుకాగా, 465 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల్లోకి స్మార్ట్ వాచ్‌లు, సెల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఏమాత్రం అనుమతించలేదు. మెటల్ డిటెక్టర్లతో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలను పటిష్టంగా అమలు చేశారు. మహిళా అభ్యర్థుల విషయంలోనూ అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేశారు.
చెవికి కమ్మలు, మెడలో గొలుసులు, గాజులు తొలగించుకున్నాకే లోపలికి అనుమతించారు.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 164 (బీ.ఎన్.ఎస్) సెక్షన్ అమలు చేయడంతో పాటు, జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆన్సర్ షీట్లు స్ట్రాంగ్ రూమ్ చేరే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆలస్యంగా రావడంతో నిరాశగా వెనుదిరిగిన విద్యార్థులు సమయ పాలన విషయంలో ఎన్‌టీయే కఠినంగా ఉండటంతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ వద్ద ఒక విద్యార్థి 2 నిమిషాల ఆలస్యంగా, మరో ఇద్దరు విద్యార్థులు 5 నిమిషాల ఆలస్యంగా రావడంతో వారిని సిబ్బంది గేటు వద్దే నిలిపివేశారు.
ఎంత వేడుకున్నా అధికారులు కనికరించలేదు. ఇదే విధంగా నాగారం లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ వద్దకు ఒక విద్యార్థి ఆలస్యంగా చేరుకోవడంతో, అధికారులు అనుమతి నిరాకరించారు.
దీంతో సదరు విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు, బోధన్ సెంటర్‌కు వెళ్లాల్సిన విద్యార్థి పొరపాటున నిజామాబాద్‌లోని కేంద్రానికి రావడంతో పరీక్షకు హాజరు కాలేకపోయారు.గత నెల 3న జరిగిన పరీక్షలో పేపర్ లీకేజీ ఘటనతో ఈసారి ఎన్‌టీయే అప్రమత్తమైంది.
ఎక్కడా ఎటువంటి చిన్నపాటి పొరపాట్లు జరగకుండా నిఘాను మరింత పెంచింది. కేంద్రాల బయట అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
