చంచల్‌గూడ నుండి ఇందిరా సేవా సదన్ (ఐ.ఎస్. సదన్) మీదుగా సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి ప్రముఖ సంఘ సేవకురాలు దివంగత సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం సైదాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వినయ్ కిషోర్ యాదవ్ మాట్లాడుతూ, దశాబ్దాల క్రితమే సైదాబాద్ సహా పరిసర ప్రాంతాల నిరుపేద విద్యార్థుల కోసం అప్పటి దేశ ప్రధాని పేరుతో ఇందిరా సేవా సదన్ విద్యాసంస్థలను నెలకొల్పిన ఘనత సంగం లక్ష్మీబాయిదని తెలిపారు.
ఆమె స్థాపించిన విద్యాసంస్థల్లో చదువుకున్న వేలాది మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నారని అన్నారు. రాజకీయ నాయకురాలిగా, సంఘ సంస్కర్తగా గుర్తింపు పొందిన సంగం లక్ష్మీబాయి పేరును ఐ.ఎస్. సదన్ మీదుగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి పెట్టడం సైదాబాద్ ప్రాంతానికే గర్వకారణంగా నిలుస్తుందని వినయ్ కిషోర్ యాదవ్ పేర్కొన్నారు.
సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని కోరుతూ త్వరలో తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, సంబంధిత ఉన్నత అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు వినయ్ కిషోర్ యాదవ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పరిషత్ ప్రతినిధులు ప్రభాకర్, శ్రీనివాస్, శేఖర్, సురేష్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
