ఫుట్‌బాల్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘ఫిఫా వరల్డ్ కప్’ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నగరంలోని బార్లు, క్లబ్బులు, బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని బార్లు, క్లబ్బులు మరియు బ్రూవరీలకు ఈ వెసులుబాటు కల్పించారు. ఫైనల్ మ్యాచ్‌ను పురస్కరించుకుని ఆయా కేంద్రాలను ఈ నెల 19వ తేదీన ఉదయం 4:30 గంటల వరకు. అలాగే 20వ తేదీన ఉదయం 3:00 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఉన్న మెట్‌లైఫ్ స్టేడియంలో (ఈ నెల 19న, ఆదివారం) స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య ఫిఫా ఫైనల్ సమరం జరగనుంది. రెండు బలమైన జట్లు తలపడుతుండటంతో మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగరంలోని ఫుట్‌బాల్ ప్రేమికులు భారీగా బార్లు, పబ్‌లకు తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
