వేపచెట్టు విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
కేసు వివరాల్లోకి వెళ్తే.. మెండోరా మండలం దూద్గావ్కు చెందిన భాగ్యవతి, నిందితుడు బుచ్చన్న నివాసాలు ఎదురెదురుగా ఉంటాయి. వారి ఇళ్ల ముందు ఉన్న వేపచెట్టు విషయంలో గత నాలుగేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో 2022 జూన్ 2న ఉదయం 9 గంటల సమయంలో నిందితుడు బుచ్చన్న, భాగ్యవతి కుమారుడు వసంత్తో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన బుచ్చన్న, వసంత్ తలను పట్టుకుని గోడకు బలంగా బాదాడు. తీవ్రగాయాలపాలైన వసంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు మెండోరా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి కేసును దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను, సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకున్న 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి హరీష.. నిందితుడు బుచ్చన్నకు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.
జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన మాజీ సీఐ గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుత సీఐ జాన్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. నర్సింహా రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై గోవింద్, ఏఎస్ఐ మురళీధర్ రాజు, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు విషన్గౌడ్, లక్ష్మణ్, రాజులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
