పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను పౌరసరఫరాల శాఖ అధికారులు పకడ్బందీగా పట్టుకున్నారు.
గురువారం నిర్వహించిన ఈ దాడుల్లో 350 క్వింటాళ్లకు పైగా బియ్యంతో పాటు, రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి వివరాలను వెల్లడించారు.
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి, ద్విచక్ర వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ కేంద్రాలకు తరలిస్తున్నారని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి గోదాములకు చేర్చి, నిల్వ చేస్తున్నారని చెప్పారు.
రాజారాంనగర్ కాలనీకి చెందిన ఐలయ్య, సంజీవు, పెరికిట్కు చెందిన నజ్జ, రాకిబ్ తదితరులు కలిసి ముఠాగా ఏర్పడి, చిన్న వాహనాల (అశోక్ లేలాండ్) ద్వారా బియ్యం మూటలను తీసుకువచ్చి, ఒక ఖాళీ ప్రదేశంలో ఉన్న భారీ ఐచర్ కంటైనర్‌లోకి మారుస్తున్నారని అధికారులకు సమాచారం అందింది.
దీనిపై అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. అధికారులు అక్కడికి చేరుకునేసరికి ఏడు అశోక్ లేలాండ్ వాహనాల నుంచి ఐచర్ కంటైనర్‌లోకి బియ్యం బస్తాలను మారుస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులను చూడగానే వాహనాల యజమానులు, డ్రైవర్లు అక్కడి నుంచి పరారయ్యారు.
వెంటనే పోలీసులు, అధికారుల సమక్షంలో మొత్తం 350 క్వింటాళ్ల బియ్యం, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను స్థానిక పోలీసుల సహకారంతో ఆర్టీసీ డిపోకు తరలించామని, బియ్యాన్ని సురక్షిత గోదాముకు తరలించినట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు.
పరారైన వ్యక్తుల వివరాలను సేకరించి పోలీసులకు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దందాలో ఉన్న ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
