రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పీఎం రాహత్’, ‘పీఎం రాహ్-వీర్’ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయిచైతన్య పిలుపునిచ్చారు.
గోల్డెన్ అవర్‌లో బాధితులకు తక్షణ చికిత్స అందించడమే ‘పీఎం రాహత్’ ప్రధాన లక్ష్యం. ప్రమాదం జరిగిన బాధితులకు రూ. 1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్యం లేదా గరిష్టంగా 7 రోజుల వరకు ఆసుపత్రిలో చికిత్స పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో మనోరమ, ప్రగతి ఆసుపత్రులను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామని సీపీ వివరించారు. ప్రమాద బాధితులను కాపాడే సామాన్యులను ‘రాహ్-వీర్’లుగా గుర్తించి, వారికి రూ. 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేయడం జరుగుతుందని సీపీ తెలిపారు.
ప్రమాద సమాచారాన్ని ‘ఈ-డార్’ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు సత్వరమే సాయం అందిస్తాయన్నారు.
ప్రమాద బాధితులకు సహాయం చేసేందుకు ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ప్రాణం కాపాడే ప్రతి ఒక్కరిని పోలీసులు గౌరవిస్తారని ఆయన భరోసానిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే 112,100,108కు సమాచారం అందించి మానవత్వాన్ని చాటుకోవాలని సీపీ కోరారు.
