గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పురుడు పోసుకున్న గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లు నేడు పక్కదోవ పడుతున్నాయి. అభివృద్ధి సాకుగా ఆంక్షలు విధిస్తూ పచ్చని పల్లెల్లో వివాదాలచిచ్చుకు ఆజ్యం పోస్తున్న సంఘటనలు కలవరపెడుతున్నాయి.
కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు వెళ్లిన గౌడ మహిళలను వీడీసీ సభ్యులు ఆలయం నుంచి వెళ్లగొట్టారు.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో ఈ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మేరకు గౌడ కులస్థులు మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయాని ముట్టడించి కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శనివారం(ఏప్రిల్ 5) కుంకుమ పూజను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పూజలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు మంగళహారతులతో వెళ్లారు.
గౌడ సంఘానికి చెందిన మహిళలు కూడా హాజరుకాగా, వారు వెళ్లిపోయేవరకూ పూజా కార్యక్రమం మొదలుపెట్టేదీ లేదని స్థానిక పురోహితుడి ద్వారా వీడీసీ సభ్యులు చెప్పించారు. అయితే మహిళలు అలాగే కూర్చుండగా పూజను ఆరంభించలేదు. చేసేది లేక గౌడ సంఘం మహిళలు గుడి నుంచి వెనుదిరిగారనీ తెలిపారు.
గ్రామంలో ఆలయ నిర్మాణం నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు నిర్వహించే కుంకుమ పూజలో తాము ఆనవాయితీగా పాల్గొంటున్నామని మహిళలు వెల్లడించారు.అయితే 2024 ఆగస్టు 16న తాళ్ళరాంపూర్ గ్రామం, మండలం : ఏర్గట్ల కు చెందిన గ్రామ అభివృద్ధి కమిటి వారు కల్లు విషయమై లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు.
అంతా మొత్తంలో డబ్బులు కట్టడం కుదరదని మేము చెప్పడంతో గ్రామ అభివృద్ధి కమిటి వారు ఎట్టి పరిస్థితుల్లో మేము చెప్పినంత డబ్బులు చెల్లించాల్సందేనని లేకుంటే కల్లు అడ్తల్ విధిస్తామని చెప్పి కల్లు అడ్తాళ్ విధించడం జరిగింది. గత ఆరు నెలలుగా గ్రామంలో ప్రజలు ఎవరు కల్లు త్రాగడం లేదు, గ్రామంలో గౌడ కులస్థుల వద్ద కల్లు త్రాగేవారు లేక ఆర్థికంగా చాలా నష్టపోయాము.
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి మాది, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు కల్లు త్రాగాడానికి వస్తే కల్లు పోస్తున్నామనీ తెలిపారు. తాటిచెట్ల విషయంలో నెలకొన్న వివాదం ఆలయానికి చేరిందనీ అన్నారు.
గౌడ కులానికి చెందిన మహిళలు శ్రీరామనవమి సందర్భంగా కుంకుమార్చన చేసేందుకు ఆలయానికి వెళ్తే వీడీసీ కఠినంగా వ్యవహరించి పూజకు వచ్చిన మహిళలకు ఆలయ పూజారి అభ్యంతరం తెలిపారు.
అవమానానికి గురైన సదరు మహిళలు పూజారితోపాటు వీడీసీలోని కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
