HomeLaw and Orderభూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి... కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి… కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.

భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్, కొడిచెర్ల గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మెండోరా మండలాన్ని పైలెట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు,వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు.

రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ కోసం వచ్చే రెవెన్యూ బృందాలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. భూ సమస్యలను పరిష్కరించుకుని, భూ వివాదాలు లేని గ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను మెండోరా మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పైలెట్ మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలలో సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని మిగతా అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు పలు సూచనలు చేశారు.

అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కారం జరిగేలా చూడాలన్నారు.

ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహశీల్దార్ సంతోష్ రెడ్డి, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments