జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్దిదారుల జాబితాను పరిశీలించారు.
ప్రభుత్వం అందించిన నివేశన స్థలాలలో లబ్దిదారులే నివాసం ఉంటున్నారా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. లబ్దిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికెట్లను తెప్పించుకుని, అవి అధికారికంగా జారీ చేసినవేనా లేక నకిలీవా అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తులు చేసుకున్నాయి, ఎంత మందికి ఇప్పటివరకు ఇళ్ళ మంజూరీలు లభించాయని వార్డు ఆఫీసర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాలలో నివాసాలు ఉంటున్న వారిలో అర్హత కలిగిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే ఆమోదం తెలుపబడిన 26 మంది లబ్దిదారులు వెంటనే ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు.
అటవీ హద్దుల సమస్య కారణంగా కొంతమంది నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారని మాజీ కార్పొరేటర్ హారూన్ కలెక్టర్ దృష్టికి తేగా, అటవీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ళ నిర్మాణాల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తెస్తే, వాటిని పరిష్కరిస్తామని అన్నారు.
లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని, ప్రభుత్వం తరపు నుండి అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహసిల్దార్ బాలరాజు, నార్త్ తహసిల్దార్ విజయ్ కాంత్ తదితరులు ఉన్నారు.
