నిజామాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. , ఈ ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు పోటీ నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతోంది.
సాంప్రదాయకంగా విస్తారమైన విరాళాలతో వెలుగొందే ఈ దేవాలయానికి దాదాపు ఒక కిలో బంగారం, 100 కిలోల వెండి నిల్వలుగా ఉన్నాయి. అలాగే రూ. 25 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆలయ ఆర్థిక స్థిరత్వానికి బలంగా నిలుస్తున్నాయి.
ప్రధాన అభ్యర్థులుగా పాల్తి రవికుమార్, బాశెట్టి విశ్వనాథ్ గుప్తా పోటీలో నిలవగా, ఇరువురు కూడా ఆలయ అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రణాళికలను వివరించారు.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పాల్తి రవికుమార్ ఇప్పటికే ఆలయ అభివృద్ధిలో తన సుదీర్ఘ సేవలను గుర్తుచేసుకుంటూ, మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు మళ్లీ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక మరోవైపు బాశెట్టి విశ్వనాథ్ గుప్తా 53 ఏళ్లుగా వివిధ దేవాలయ కమిటీలలో అధ్యక్షుడిగా సేవలు చేసి అనుభవం కలిగి ఉండటాన్ని హైలైట్ చేస్తూ, ‘‘వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అభివృద్ధి కోసం తనకు ఈసారి అవకాశం ఇవ్వాలి’’ అని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాల్సి ఉంది. ఆదాయ వనరులు, భక్తుల విశ్వాసాన్ని సమర్థంగా వినియోగిస్తూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరనే ఉత్కంఠ వైశ్య సంఘంలో నెలకొంది.
