పార్వతీపారమేశ్వరుల ప్రాణ పుత్రుడు.. గణనాథుడు నేడు కొలువుదీరాడు. ఉండ్రలయ్యాకు దండాలు పెడుతూ నిత్య పూజలు అందించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. విఘ్నాలు తొలగించు వినాయక..
అంటూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏ కార్యం తలపెట్టినా ఆది పూజలు అందేది వినాయకుడికే. ఏ వ్రతం చేపట్టినా గణపతి స్త్రోత్రంతోనే పూజలు ప్రారంభించడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున వినాయక చవితిని సంబరంగా చేసుకుంటారు. నేడు వినాయక చవితి పురస్కరించుకుని వేడుకలకు ఉమ్మడి జిల్లా వాసులు సిద్ధమయ్యారు.
విగ్రహాల ప్రతిష్టాపనకు మండపాలను ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. నేటి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి లంబోధరుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. మార్కెట్లలో గణేశ్ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగాయి.
పూజకు కావాల్సిన పూలు, పండ్లు ఇతర సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి.నేటి నుంచి ప్రత్యేక పూజలు, భక్తిపాటలు, సాంస్కతిక కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు కోలాహలంగా మారనున్నాయి. వినాయక చవితిన సందర్భంగా ఇళ్లల్లోనూ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందు కోసం వినాయక విగ్రహాలను కొనుగోలు చేశారు.
పర్యావరణాన్ని దష్టిలో ఉంచుకొని చాలా మంది మట్టి వినాయక విగ్రహాల కొనుగోలుకు మొగ్గు చూపారు. గణనాథులను ఉరేగింపుగా తీసుకువచ్చి బుదవారం సాయంత్రం మండపాల్లో నెలకొలపనున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వ హిస్తారు. భక్తులు నవరాత్రులు, వినాయకుడికి మండపాల్లో ప్రత్యేక పూజలు చేసి చివరి రోజు స్థానికం గా ఉన్న చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
సందడిగా మార్కెట్లు..
వినాయక పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు జిల్లా ప్రజలు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో సందడిగా కనిపించారు. వినాయక విగ్రహాలను, తుమ్మి ఆకు, ఒనగాయ, పత్రహరితంతో పాటు పూజ సామగ్రిని, పండ్లను, ఆకులను కొనుగోలు చేశారు.
ఆకులు, పువ్వులు, పండ్లు, స్వీట్లు కొనుగోలు చేసేందుకు దుకాణాల్లో రద్దీగా కనిపించారు. మండళ్ల వారు వాహనాల్లో భారీ విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. దీంతో జిల్లా కేంద్రం సందడిగా మారింది. పూలు, పండ్లు, పూజా సామగ్రికి డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి.
నిరంతరం గా పర్యవేక్షణ ఉంటుంది.
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..
గణేష్ ఉత్సవాలు ముగిసేంత వరకు జిల్లా వ్యాప్తంగా నిరంతరం గా పర్యవేక్షణ ఉంటుంది. నగరంతోపాటు పాటు పలు గణేష్ మండపాలు, ప్రధాన కూడళ్ల వద్ద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది.
వినాయ కులను నిమజ్జనం చేసే గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కూడా కట్టుది ట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తాం. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి.పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా అన్ని మండపాల వద్ద పోలీసు పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. పోలీసులు పికెట్ నిర్వహించనున్నారు.మండపాల నిర్వాహకులు రక్షణగా వలంటీర్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద శోభాయాత్ర సమయంలో డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. సాధ్య మైనంత వరకు మట్టి గణేష్ ప్రతిమలనే ప్రతిష్ఠించాలని సూచి స్తున్నారు. సమస్యాత్మక గణేష్ మండపాలను గుర్తిస్తూ నిర్వా హకులకు ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు.
