డివైడర్ పై అడ్వర్టైజ్ మెంట్ బోర్డులు పెట్టడానికి అడ్డుగా ఉన్నాయని 400 చెట్లనుఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నరికి వేయించినట్లు బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు.
బుధవారం జీవన్ రెడ్డి ఆర్మూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా బస్–స్టాండ్ వద్ద డివైడర్ పై పెంచిన చెట్లను నరికివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున నాటిన మొక్కలు పదేళ్ళుగా నీడనిచ్చే చెట్లుగా ఏపుగా పెరిగి , డివైడర్ కు ఇరువైపులా విద్యుత్ లైట్ల కాంతిని కంట్రోలు చేస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా కాపాడుతుండగా వాటిని ఇష్టారీతిన నరికివేయడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ చెట్ల నరికివేతతో ఆర్మూర్ పట్టణ సుందరీకరణ లక్ష్యం దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అవసనరమైతే తప్ప ఎలాంటి పర్మిషన్ లేకుండా చెట్లను నరికేసే అధికారం ఎక్కడిదని ఆయన నిలదీశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ కేవలం కమిషన్ల వసూళ్ల కోసం తన తాబేదారుకు అడ్వర్టైజ్ మెంట్ బోర్డులు పెట్టడానికి కాంట్రాక్టు ఇప్పించి సరికొత్త దోపిడీకి పాల్పడ్డారని ఆయన అన్నారు.
ఈ చర్యపై ప్రకృతి ప్రేమికులతో పాటు ఆర్మూర్ పట్టణ ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నదని ఆయన చెప్పారు. 3 కిలో మీటర్ల పొడవునా 400 చెట్లను నేలకూల్చిన తప్పిదం కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి వత్తిడితో మున్సిపల్ అధికారుల నిర్వాకం వల్లే జరిగిందని ఆయన ఆరోపించారు. కలెక్టర్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి లేకుండా చెట్లను నరికే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
కేవలం కాంగ్రెస్ ఇంచార్జి పీవీఆర్ కమిషన్ల పిచ్చికి బంగారం లాంటి పచ్చని చెట్లు బలయ్యాయని ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆర్మూర్ నియోజకవర్గంలో సాగిస్తున్న అరాచకాలను, అవినీతి భాగోతాలను అడ్డుకోవడానికి, ప్రజల పక్షాన పోరాడటానికి తన ఇంటిని జనతాగ్యారేజ్ గా మార్చిన తరువాత నమోదైన డివైడర్ పై చెట్ల నరికివేత మొదటి కేసు అని ఆయన అన్నారు.
తమకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, ప్రజలకు అన్యాయం చేసే వారిపైనే తమ పోరాటమని స్పష్టం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయన బెదిరింపులకు లొంగి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులు పీవీఆర్ అవినీతికి, అరాచకాలకు అండగా నిలుస్తున్నారని ఆయన ఆరోపించారు.
కనీసం వార్డు మెంబర్ కాదుకదా గవర్నమెంట్ లో చెప్రాసి కూడా కాని వినయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విధుల్లో ఎలా జోక్యం చేసుకుంటారని?, ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను ఎలా పర్యవేక్షిస్తారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
పీవీఆర్ మాట వినే అధి కారులు జైలుపాలు కాక తప్పదన్నారు. ఇప్పటికే వినయ్ కుమార్ రెడ్డి అవినీతిలో పాలుపంచుకొని పలువురు రెవెన్యూ అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారని, గతంలో ఒక ఎంవీఐతో పాటు తాజాగా ఆర్మూర్ మునిసిపల్ కమిషనర్ రాజ్ కుమార్ ఏసీబీ వలలో చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆర్మూర్ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్ నియామకం జరగడం హర్షణీయమన్నారు.
కొత్త కమిషనర్ అయినా పాత కమిషనర్ మాదిరిగా కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి అవినీతికి కొమ్ము కాయకుండా ప్రజల కోసం పని చేయాలన్నారు. కొత్త కమిషనర్ వెంటనే డివైడర్ పై నరికేసిన చెట్ల స్థానంలో కనీసం కొబ్బరి మొక్కలనైనా నాటించాలని ఆయన సూచించారు. కాగా ఆర్మూర్ లో చెట్ల నరికివేతపై కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
చెట్ల నరికివేతను సుమోటోగా స్వీకరించి బాధ్యులపై కేసు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరెంధర్,సీనియర్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి,పోల సుధాకర్,సుంకరి రవి,రంజిత్,గిరిష్ తదితరులు పాల్గొన్నారు.
