నిజామాబాద్, డిసెంబర్ 11 : నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 19.80 శాతం పోలింగ్ నమోదయ్యింది. 11 గంటల సమయానికి 50.73 శాతం ఓటింగ్ పూర్తయ్యిందని అధికారులు ప్రకటించారు.
కాగా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఎడపల్లి మండలం జానకంపేట, ఎం.ఎస్.సీ ఫారంలలో, బోధన్ మండలం పెగడాపల్లిలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు.
కలెక్టర్ పర్యవేక్షణలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో మొత్తం 184 సర్పంచ్ స్థానాలకు గాను, నామినేషన్ల ఉపసంహరణ నాటికే 29 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అదేవిధంగా మొత్తం 1642 వార్డు స్థానాలకు గాను 07 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 575 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
వీటిని మినహాయిస్తూ, 1060 వార్డు స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరిగాయి. 11 మండలాల పరిధిలో 1440 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్, అనంతరం వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల సమయానికే 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది.
జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం సత్ఫలితాలు ఇచ్చింది. ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి నివాస ప్రాంతంలో వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను పంపిణీ చేయడం, బీ.ఎల్.ఓలతో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు వారి ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది అనే విషయాన్ని తెలియజేసేలా చర్యలు తీసుకోవడంతో ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. 71 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, 31 కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, 40 పోలింగ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు.
కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు. మద్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించారు.
అనంతరం మద్యాహ్నం 2.00 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కాగా, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు.
పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలం సులేమాన్ నగర్, వర్ని మండలం సత్యనారాయణపురం, చందూర్, మోస్రా, బోధన్ మండలం అమ్దాపూర్, ఎడపల్లి తదితర చోట్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
