నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో గల పూజా హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పూజా హాస్పిటల్‌ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో ఏవోకు వినతిపత్రం అందజేశారు.
నగర కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ, ఈ నెల 22న రాత్రి హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న యువతిపై రోహిత్ అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడని తెలిపారు. ఈ దారుణానికి దినేష్, హన్మండ్లు మరియు అక్కడి వాచ్మెన్ సహకరించారని ఆరోపించారు.
వీరంతా ఆసుపత్రి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డికి అనుచరులని పేర్కొన్నారు. పోలీసులు కేవలం రోహిత్‌పై మాత్రమే కేసు నమోదు చేశారని, సహకరించిన మిగిలిన వారిని కేసు నుండి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
పూజ ఆసుపత్రి నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయని నాయకులు గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో అక్రమంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ప్రచారం ఉందని ఆరోపించారు.గత ఐదారు నెలలుగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అన్ని శస్త్రచికిత్సలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
సరైన వైద్య విద్య లేని వారు కూడా పార్ట్ టైం డాక్టర్ల పేరుతో ఆసుపత్రులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి మాట్లాడుతూ, పనిచేసే చోట కూడా మహిళలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు.
ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేస్తున్న ఇలాంటి ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అత్యాచారయత్నం చేసిన రోహిత్‌తో పాటు అతనికి సహకరించిన దినేష్, హన్మండ్లు, వాచ్మెన్లను వెంటనే అరెస్టు చేయాలి.పూజా హాస్పిటల్‌ను తక్షణమే సీజ్ చేసి, రికార్డులను స్వాధీనం చేసుకోవాలి.
జిల్లాలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్, నాయకులు విటల్, అమూల్య, బుజ్జినాగూర్ తదితరులు పాల్గొన్నారు.
