HomeLaw and Orderభావి తరాలకు నష్టం వాటిల్లకుండా బాధ్యతగా వ్యవహరించాలి...గ్రామ సభలో కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు... ...

భావి తరాలకు నష్టం వాటిల్లకుండా బాధ్యతగా వ్యవహరించాలి…గ్రామ సభలో కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు… పాల్గొన్న పొలీస్ కమిషనర్ సాయి చైతన్య..

మన భావి తరాలకు నష్టం జరుగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి హితవు పలికారు. సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరు గుర్తెరిగి బాధ్యతతో మెలగాలని సూచించారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో గురువారం గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టారు. మోపాల్ మండలం న్యాల్ కల్ లో గ్రామ సచివాలయం ప్రాంగణంలో సర్పంచ్ చంద్రకళ అధ్యక్షతన జరిగిన గ్రామ సభకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సంబంధిత శాఖల అధికారులు గ్రామస్థులకు వివరించడంతో పాటు, ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియకు సహకరించడం, పంటల మార్పిడి, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించాల్సిన ఆవశ్యకత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భజలాల పెంపుదల, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, ఘన వ్యర్ధాల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు చేసినందున, తదనుగుణంగా అనుకూలమైన పంటలను ఎంచుకోవాలని రైతులకు హితవు పలికారు. పంట మార్పిడి విధానాలను అవలంభించాలని, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను పాటిస్తూ నాణ్యమైన ఎరువులు, విత్తనాలను వినియోగించాలని సూచించారు. ఎక్కడైనా నాసిరకం, నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

తనిఖీల కోసం పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. కాగా, మోతాదుకు మించి ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడవద్దని, పర్యావరణానికి హాని చేకూర్చే విధంగా వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని రైతులకు సూచించారు. దీనివల్ల కాలుష్యం వ్యాపిస్తూ భావి తరాలకు కూడా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, బాధ్యులకు రూ. 5వేలు మొదలుకుని రూ. 25వేల వరకు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయని సూచించారు. పర్యావరణ సమతుల్యత, పచ్చదనాన్ని పెంపొందించేందుకు గాను విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

పారదర్శకమైన ఓటరు జాబితా కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇంటికి వచ్చే బీ.ఎల్.ఓలకు తగిన వివరాలు అందించాలని సూచించారు. చెరువుల శిఖం భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పన్నులను సకాలంలో చెల్లిస్తూ, గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని హితవు పలికారు.

పొలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. శాంతియుత వాతావరణం నెలకొని ఉన్న ప్రాంతాలు సత్వర అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. నేరాల నియంత్రణకు ఉపకరిస్తూ, నేరాలు జరిగిన సందర్భాలలో నిందితుల ఆచూకి తెలుసుకునేందుకు ఉపకరించే సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలు, దురలవాట్లకు యువత దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకుని రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కృషి చేయాలన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలకు భద్రతా కల్పించడానికి పోలీసు శాఖ ఎల్లవేళలా సమాయత్తంగా ఉంటుందని తెలిపారు.

గ్రామ సభలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, నిజామాబాద్ ఏ.సీ.పీ ప్రకాష్, డీ.ఎల్.పీ.ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రాములు నాయక్, తహసిల్దార్ రేఖ, మండల వ్యవసాయ అధికారి జాదవ్ హీరా, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments