నిజామాబాద్ నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ స్వప్న ఆధ్వర్యంలో కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని రిలయన్స్ మార్ట్ సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు 13 కిలోల ఎండు గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లోని ఇద్దరు మహిళలు (పూజా సనార్, దుర్వాద బాయ్) మధ్యప్రదేశ్‌లోని సిర్పూర్ పట్టణంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వద్ద కిలో గంజాయిని రూ. 9,000 చొప్పున కొనుగోలు చేశారు. అక్కడి నుంచి కిన్వట్ చేరుకుని మరో ఇద్దరు నిందితులతో కలిశారు. అనంతరం బస్సు మార్గంలో నిర్మల్ మీదుగా నిజామాబాద్‌కు చేరుకున్నారు.
నిందితులు కిలో గంజాయిని రూ. 15,000 చొప్పున మరొకరికి విక్రయించేందుకు రిలయన్స్ మార్ట్ వద్ద వేచి చూస్తుండగా ఎక్సైజ్ పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు.
నిజామాబాద్ నగరంలో చిన్న చిన్న పొట్లాలుగా చేసి కిలోకు రూ. 20,000 వరకు లాభం గడించాలని నిందితులు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. పూజా సనార్ (ఆదిలాబాద్),దుర్వాద బాయ్ జాదవ్ (ఆదిలాబాద్),కిషన్ మోతిరామ్ గార్ (నాందేడ్, మహారాష్ట్ర), ఇంద్రజిల్ టార్చ్ (యవత్మాల్, మహారాష్ట్ర), మంజు వెంకటరామ్ (గాంధారి, కామారెడ్డి)ల పై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
