నిజామాబాద్ నగర అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, అస్తవ్యస్తమైన పాలనతో నగరాన్ని చెత్తకుప్పగా మార్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకే దక్కుతుందని బీఆర్ఎస్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నిజామాబాద్ నగరంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు,ఎస్ఐఆర్ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పి, అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన ఎమ్మెల్యే ధన్పాల్ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని బిగాల డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో పార్టీ బూత్ ఏజెంట్లు, ఇంచార్జులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఓటరు జాబితాలో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు.
త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించి, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన ఐటి హబ్, వెజిటబుల్ మార్కెట్, మహా ప్రసాదం వంటి భవనాలు నేడు నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారాయి.
ఐటి హబ్ నిర్మాణమైనప్పటికీ, అక్కడ కంపెనీల జాడ లేకపోవడం గమనార్హం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, రెండో వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులు ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయని నేతలు ఆరోపించారు.ప్రజలు సమస్యలతో అధికారుల వద్దకు వెళ్తే, తమ పార్టీ అధికారంలో లేదని సాకులు చెబుతున్నారని, ఎమ్మెల్యేలను కలిస్తే ‘ప్రభుత్వంతో సంబంధం లేదు’ అని దాటవేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
“అధికారం లేకపోతే రాజీనామా చేయండి, చేతకాకపోతే దమ్ముంటే ప్రజల ముందు తప్పుకోండి” అని ఈ వేదిక సాక్షిగా బిగాల గణేష్ గుప్తా సవాల్ విసిరారు. బాధ్యతాయుత పదవుల్లో ఉండి, నిస్సహాయతను ప్రదర్శించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కుల సంఘాలకు నిధులు ఇవ్వడమే కాకుండా, సాయిబాబా గుడి, పెద్దమ్మ తల్లి గుడి, మార్కండేయ గుడి, దర్గాల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేశారు. కోవిడ్ కష్టకాలంలో ప్రభుత్వం కంటే ముందే స్పందించి, సుమారు లక్షా ఇరవై వేల మందికి భోజన వసతి కల్పించామని, మానవతా దృక్పథంతో నిజామాబాద్ ప్రజలకు అండగా నిలిచామని నేతలు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, తెలంగాణా-ఆంధ్రా ప్రజల మధ్య బీజేపీ, చంద్రబాబుల దర్శకత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజల నాడిని గుర్తించే సమయం ఆసన్నమైందని బిఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.
ఆరు గ్యారెంటీలు కాదు, 420 గ్యారెంటీల పేరుతో ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని వారు పిలుపునిచ్చారు. ఏది ఏమైనా, రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలోనే మళ్లీ సుస్థిర పాలన అందుతుందని నేతలు స్పష్టం చేశారు. *అభివృద్ధిని గాలికి వదిలేసిన పాలకులు: జీవన్ రెడ్డి* మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన నుండి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు.
“తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం, అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ఏకైక పార్టీ బీఆర్ఎస్,” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, “ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త నాటకాలకు తెరలేపింది. ప్రజలు వీరి మోసపూరిత వైఖరిని గమనిస్తున్నారు,” అని హెచ్చరించారు. సభ్యత్వ నమోదుపై మాట్లాడుతూ, “పార్టీ సభ్యత్వం అనేది కేవలం కాగితం మీద పేరు రాయడం కాదు, అది పార్టీతో కార్యకర్తకు ఉండే అనుబంధం.
ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలి. గ్రామాలు, వార్డులు, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది,” అని పిలుపునిచ్చారు. అలాగే, ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ, “ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం. మన పార్టీకి చెందిన బూత్ ఇంచార్జులు, నాయకులు ఎంతో అప్రమత్తంగా ఉండి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా చూడాలి. ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చూడటం మన బాధ్యత,” అని ఆయన స్పష్టం చేశారు.
నిజామాబాద్ నగరం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందిస్తూ, పాలకులు సమస్యలను పక్కనపెట్టి ప్రచారానికే పరిమితం కావడం విడ్డూరమని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండే, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, నాయకులు దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతీన్ తదితర డివిజన్ ఇంచార్జులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
