విదేశాల్లో భారీ జీతంతో కూడిన ఉద్యోగాలంటూ నమ్మించి, అమాయక నిరుద్యోగులను సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ముఠా గుట్టును నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితులను మయన్మార్‌లోని డెత్ క్యాంపులకు తరలించి, అక్కడ వారిని చిత్రహింసలకు గురిచేస్తూ బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నట్లు విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశ్వర్ రావు కథనం ప్రకారం.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిందితుడు టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన అజ్ఞాత వ్యక్తుల వలలో పడ్డాడు. విదేశాల్లో అధిక జీతాలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఏజెంట్‌గా మారాడు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, కంపెనీ వివరాలు ధృవీకరించకుండానే తన పరిచయస్తులను థాయిలాండ్ పంపించాడు.
టిక్కెట్లు, ఇతర ఖర్చుల పేరిట భారీగా నగదు వసూలు చేశాడు. ప్రారంభంలో కొంత కమిషన్ అందడంతో ఈ దందాను యథేచ్ఛగా కొనసాగించాడు. థాయిలాండ్ చేరుకున్న బాధితులను అక్కడి నుంచి రహస్యంగా, అక్రమ మార్గాల్లో వాహనాలు మారుస్తూ, అడవి బాటలో మయన్మార్‌లోని ‘డాంగ్మీ పార్క్’ అనే ప్రాంతానికి తరలించారు.
అక్కడ బాధితుల పాస్‌పోర్టులను లాక్కొని బందీలుగా మార్చారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కఠిన నియంత్రణలో ఉంచారు. నిర్బంధంలో ఉన్న బాధితులతో బలవంతంగా నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు చేయించారు.
రోజువారీ టార్గెట్లు పూర్తి చేయని వారికి ‘వాల్ చెయిర్’, పుష్ అప్స్, స్క్వాట్స్ వంటి కఠిన శారీరక శిక్షలు విధించేవారు. మానసిక ఒత్తిడి, అవమానాల మధ్య నరకం అనుభవించిన బాధితులను వదిలేయాలంటే ఒక్కొక్కరు 5,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4 లక్షలకు పైగా) చెల్లించాలని ముఠా సభ్యులు డిమాండ్ చేశారు.
అక్కడ ప్రాణభయంతో వణికిపోయిన బాధితుడు, మరికొందరితో కలిసి ఎలాగోలా తప్పించుకుని స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. భారత ఎంబసీ చొరవతో ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకున్నాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం వేట కొనసాగుతోంది. నిరుద్యోగులు విదేశీ ఉద్యోగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
టెలిగ్రామ్, వాట్సాప్‌లో వచ్చే విదేశీ ఉద్యోగ ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దు. రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
అసలైన కంపెనీలు భారీ మొత్తంలో ముందస్తు చెల్లింపులు కోరవు. ఆఫర్ లెటర్, వీసా గడువు, కంపెనీ ఉనికిని ఎంబసీ ద్వారా ధృవీకరించుకున్నాకే విదేశాలకు వెళ్లాలనీ సూచించారు.
