HomeTelanganaNizamabadబీజేపీ మేయర్ అభ్యర్థిగా స్రవంతి రెడ్డి?అధిష్ఠానం మొగ్గు ఆమె వైపే.

బీజేపీ మేయర్ అభ్యర్థిగా స్రవంతి రెడ్డి?అధిష్ఠానం మొగ్గు ఆమె వైపే.

. మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో నిజామాబాద్ కార్పొరేషన్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేయర్ అభ్యర్థి ఎంపికపై దాదాపు ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది.

మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి పేరును మేయర్ అభ్యర్థిగా అధిష్ఠానం ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 43వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన స్రవంతి రెడ్డి, అప్పట్లో అధికార పార్టీ వైఫల్యాలపై నిత్యం పోరాటం చేశారు.

మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న సమయంలో కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తి ‘ప్రజా గొంతుక’గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను పలు అభివృద్ధి అంశాలపై సూటిగా నిలదీయడం ద్వారా ఆమె రాజకీయంగా జిల్లాలో బలమైన ముద్ర వేశారు.

ఈసారి నిజామాబాద్ మేయర్ పీఠం ‘మహిళా జనరల్’ కేటగిరీకి కేటాయించడంతో స్రవంతి రెడ్డికి మార్గం సుగమమైంది.అందుకే ఆమెకు మళ్ళీ ఈసారి 6 వ డివిజన్ నుంచి బరిలోకి దిగారు.ఇక కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లపై పూర్తి అవగాహన ఉండటం, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రధాన సమస్యలపై పట్టు ఉండటం ఆమెకు అదనపు బలంగా మారాయి.

రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉండటం వల్ల అటు పార్టీ కేడర్‌లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆమెకు ఉన్న ఆదరణను గెలుపు గుర్రాలుగా మలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. కేవలం తన డివిజన్ పరిధికే పరిమితం కాకుండా, నగరం మొత్తం మీద బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు.

పార్టీ నిర్ణయించిన అభ్యర్థులందరినీ గెలిపించుకోవడమే ధ్యేయంగా ప్రతి డివిజన్‌లోనూ ప్రచారం నిర్వహించేందుకు స్రవంతి రెడ్డి సన్నద్ధమవుతున్నారు.

పార్టీ పెద్దల ఆశీస్సులు కూడా ఆమెకే ఉన్నట్లు సంకేతాలు వెలువడటంతో, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి నిజామాబాద్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కమలనాథులు, స్రవంతి రెడ్డి నాయకత్వంలో ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments