గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చర్లపల్లి జైలుకు చెందిన ఒక ఖైదీ గురువారం మృతి చెందాడు. మృతుడిని సోన్న అడెల్లుగా గుర్తించారు.ఘటన వివరాలు:అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సోన్న అడెల్లును, గతంలో నిర్మల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకు బదిలీ చేశారు. కొంతకాలంగా అడెల్లు ఛాతీ మరియు ఒళ్లు నొప్పులతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో జైలు అధికారులు అతడిని పలుమార్లు గాంధీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.
ఈ క్రమంలోనే ఈనెల 24న అతడికి తీవ్రమైన గుండెపోటు రావడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అడెల్లు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు డయాలసిస్ కూడా చేశారు.
అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 2:33 గంటలకు అడెల్లు ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. అడెల్లు ‘కార్డియోజెనిక్ షాక్’తో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి కుటుంబసభ్యులకు జైలు అధికారులు సమాచారం అందించారు.
