తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సమస్యలు, వారి సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యమకారుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో ఆర్.టి. నంబర్ 679 ద్వారా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో, ఆ కమిటీ సభ్యులు జూన్ 27, న నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లతో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జేఏసీ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి డాక్టర్ కె. కేశవరావు (ప్రభుత్వ సలహాదారు) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా పొన్నం ప్రభాకర్ (రవాణా శాఖ మంత్రి), ప్రొఫెసర్ కోదండరామ్ (ఎమ్మెల్సీ), అడ్లూరి దయాకర్ (విప్), ఎస్. రాములు నాయక్ (మాజీ ఎమ్మెల్సీ), మరియు ఎం. శోభన్ రెడ్డి ఉన్నారు.
రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి జిల్లాలోని ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల విషయంలో సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకంతో, తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువెళ్లాలని, తగిన సలహాలు అందించాలని ఉద్యమకారులకు జేఏసీ పిలుపునిచ్చింది.
ఈ సమావేశంలో జేఏసీ ఛైర్మన్ గోపాల్ శర్మ, కన్వీనర్ జి. గంగారాం, దాదన్నగారి విఠల్ రావు, ఎక్స్-వైస్ ఛైర్మన్ షేక్ హుస్సేన్, మైనార్టీ లీడర్ ఎస్.కె. నజీర్, సకి విజయ్ కుమార్, కోనూరు సాయికుమార్, డి. ప్రభాదాస్, పుల్లం హితన్, పి.ఎం.పి రాష్ట్ర అధ్యక్షులు పులి జయపాల్, ఆదె ప్రవీణ్, కొత్త శివరామకృష్ణ, కె. సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
