కళ్లముందే అక్రమాలు స్పష్టంగా ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవ డంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రూ. కోట్ల విలువైన సర్కారు భూములు అన్యాక్రాంతమైనా పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. నగరంలోని ఖిల్లా ప్రాంతంలో ఒ ప్రభుత్వ భూమి.. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ‘మాయం’ అవుతోంది.
డంపింగ్ యార్డుగా ఉన్న స్థలాన్ని కుల సంఘానికి కేటాయిస్తే, ఆ కీలక నేతలు ఇప్పుడు రికార్డులను సైతం మార్చేసి.. కోట్లాది రూపాయల ఆస్తిని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు తెగబడుతున్నారు.
హద్దురాళ్లు పీకేసి, రాత్రికి రాత్రే షెడ్లు వేస్తూ సాగిస్తున్న ఈ ‘భూదందా’పై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న ‘రాజకీయ’ శక్తులెవరివి? అనే ప్రశ్న ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.నగరంలోని 28వ డివిజన్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 2545పై కొందరు నేతలు కన్ను పడింది.
ప్రభుత్వ పత్రాల్లో ఉన్న ఈ సంఖ్యను ‘2546’గా మాయాజాలం చేసి, హైకోర్టు ఉత్తర్వుల పేరుతో భ్రమలు కల్పిస్తున్నారు. వాస్తవానికి, అప్పట్లోనే ఆర్డీఓ ఈ స్థలం ప్రభుత్వానిదేనని, అది 2545 సర్వే నెంబరేనని నిర్ధారిస్తూ హద్దులు నిర్ణయించారు.
ఇప్పుడు ఆ హద్దులను సైతం తుడిచిపెట్టేసి, మళ్ళీ అవే పాత ఎత్తుగడలతో ఆక్రమణలకు తెరలేపారు.ఈ అక్రమ భూ పంపిణీ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు జూన్ 24న ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కనీస స్పందన లేదు.
రాత్రికి రాత్రే షెడ్ల నిర్మాణం జరుగుతుంటే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి.అధికార పార్టీకి చెందిన నేతల అండ ఉండటంతోనే అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అక్రమంగా మార్చిన రికార్డులపై సమగ్ర విచారణ చేపట్టాలి.
నకిలీ పత్రాలను సృష్టించిన ‘ఘనుల’పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.ప్రభుత్వ భూమికి పక్కా రక్షణ కల్పించి, స్వాధీనం చేసుకోవాలి అని స్థానికులు కోరుతున్నారు. సర్వే నెంబర్ 2545ను 2546గా రికార్డుల్లో తారుమారు చేసి, అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారంటూ జూన్ 24న స్థానికులు మున్సిపల్ కమిషనర్‌కు స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేశారు.
అయితే, ఫిర్యాదు అంది రెండు రోజులు గడుస్తున్నా.. అక్రమార్కులపై కనీస చర్యలు లేకపోవడం, పైగా వారు దర్జాగా హద్దురాళ్లు పీకేసి షెడ్లు వేస్తుండటం వెనుక ఉన్న ‘రాజకీయ ఒత్తిళ్లు’ ఏంటో అధికారులే చెప్పాలి.
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన వారే కబ్జాదారులకు కొమ్ము కాస్తే, ఇక సామాన్యుడి ఆస్తికి దిక్కు ఎవరు? ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఖిల్లా ప్రాంతంలో జరుగుతున్న ఈ భూ దందాను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
