నిజామాబాద్ గడ్డపై ఎంపీ ధర్మపురి అర్వింద్ కేవలం మోదీ మంత్రం చదువుతున్నారు తప్ప జిల్లాకు చేసింది శూన్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మూడు సార్లు అధికారంలో ఉండి ఈ నగరాన్ని ఎందుకు స్మార్ట్ సిటీగా చేయలేదనీ ప్రశ్నించారు.
అలాగే నిజామాబాద్ తర్వాత మున్సిపల్ గా ఏర్పడిన కరీంనగర్ ను ఎందుకు చేశారు. అలాగే ఇక్కడికి ఎయిర్‌పోర్ట్ ఎందుకు తీసుకురాలేదు?” అని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం నిజామాబాద్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన’ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు
. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని సీఎం ఆరోపించారు. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను 48 గంటల్లో జైల్లో పెడతామని ప్రగల్భాలు పలికిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఏ బొక్కలో ఉన్నాడని అడిగారు.
కేసీఆర్‌కు దొంగపుత్రుడు కేటీఆర్ అయితే, కిషన్ రెడ్డి దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి ఇప్పుడు ‘కల్వకుంట్ల కిషన్ రావు’గా మారిపోయారని విమర్శించారు. ఆరు నెలల క్రితమే అవినీతిపై సీబీఐకి ఆధారాలు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డే కేసీఆర్‌ను కాపాడుతున్నారని దుయ్యబట్టారు.బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తనను ‘రేవంత్ ఒద్దిన్’ అని విమర్శించడంపై సీఎం ధీటుగా స్పందించారు. “ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చాం, అజహరోద్దీన్‌ను మంత్రిని చేశాం. నన్ను అలా పిలవడం సంతోషమే” కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడుతూ కిషన్ రెడ్డి కిషన్ రావు గా మారాడని అన్నారు.
మోదీ అన్ని నదులను శుద్ధి చేస్తుంటే.. తాము మూసీ నదిని ప్రక్షాళన చేయవద్దా? అని ప్రశ్నించారు. గతంలో డీఎస్, వైఎస్ లాంటి జోడల్ల మాదిరిగా 2023లో మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చామని, మళ్లీ 2029లో కూడా తమ ఇద్దరి కాంబినేషన్‌లో పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాకు తన మనసులో ప్రత్యేక స్థానముందని సీఎం గుర్తు చేసుకున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ₹1,045 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు.”కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మన వాళ్లయితేనే నిధుల వినియోగం, అభివృద్ధి సాధ్యం. నిజామాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ తెచ్చే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు.
ఇక్కడి అంకాపూర్ చికెన్ దేశంలోనే ఫేమస్ అని, అలాగే ఇక్కడి రైతాంగ పోరాట పటిమ దేశానికే ఆదర్శమని కొనియాడారు. జిల్లా అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే మున్సిపల్ మంత్రిగా బాధ్యత తనదేనన్నారు.
