నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బందోబస్తులో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించినందుకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్‌తో పాటు ఆయన అనుచరులపై టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో నిజామాబాద్‌లోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 285, 286, 287 పోలింగ్ బూత్‌ల వద్ద గుర్రం నారాయణతో పాటు హెడ్ కానిస్టేబుల్ సలీం (1019), కానిస్టేబుళ్లు బి. గోవర్ధన్ (2145), శ్రీనివాస్ (2947) బందోబస్తు విధుల్లో ఉన్నారు.
ఆ సమయంలో ఎంపీ అరవింద్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. “287 పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది? మా అభ్యర్థిని బయటకు పంపింది ఎవరు?” అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “తన్నులు తింటారా? ఒళ్లు బలిసిందా? దిమాక్ ఖరాబైందా?” అంటూ పరుష పదజాలంతో దూషించినట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్కడితో ఆగకుండా, తన అనుచరుడైన పండు అలియాస్ బంటు ప్రవీణ్‌ను ఉద్దేశించి.. “నువ్వు లోపలికి వెళ్లు, నిన్ను ఎవరైనా ఆపితే తన్నుకుంటూ బయటకు తీసుకురా” అని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. నిషేధిత స్టిల్ , వీడియో కెమెరాలతో ఎంపీ తన అనుచరులతో (7-8 మంది) కలిసి పోలింగ్ బూత్‌లలోకి చొరబడి, అక్కడి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసినట్లు ఇన్‌స్పెక్టర్ బి. రఘుపతి వెల్లడించారు.
విధుల్లో ఉన్న పోలీసులను బెదిరించి, ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు గాను ఎంపీ అరవింద్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు:
* BNS సెక్షన్లు: 132, 223, 296(b) * తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019: సెక్షన్ 226 * క్రైమ్ నంబర్: 51/2026ప్రస్తుతం ఈ ఘటనపై టౌన్-1 పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
