ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ హోరాహోరీగా, అదే సమయంలో అత్యంత ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.మొదటి రెండు గంటలు మందకొడిగా సాగిన ఆ తర్వాత పుంజుకుంది. జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టడంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల ప్రక్రియ విజయవంతమైంది. జిల్లాలో మొత్తం 729 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భారీగా ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా సగటున 61.90 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఇక్కడ కేవలం 59.12 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయ్యింది. కాగా, పట్టణ ప్రాంతాల కంటే మున్సిపాలిటీల్లో ఓటర్లు అత్యంత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఆర్మూర్ 68%,బోధన్ 68.64%,భీమ్‌గల్ 69.78% శాతం ఓటింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలిరావడంతో కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ వంతు కోసం ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూశారు. అయితే, సాయంత్రం 5 గంటల లోపు వరుసలో నిలబడిన వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను భారీ భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. శుక్రవారం ఉదయం నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులకు గురువారం రాత్రి అత్యంత భారంగా గడవనుంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా, లోలోపల మాత్రం ఓటమి భయం వెన్నాడుతోంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ ఎవరికి వస్తుంది? ఒకవేళ ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఎవరి మద్దతు కీలకం అవుతుంది? అనే అంశాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.చతుర్ముఖ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుందో?ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య సాగిన చతుర్ముఖ పోటీ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమ వ్యూహాలతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. సంక్షేమ పథకాలే తమను గట్టెకిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇమేజ్, స్థానిక ఎమ్మెల్యేల బలం తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. స్థానికంగా క్షేత్రస్థాయిలో బలాన్ని నమ్ముకున్న బీజేపీ ఎలాగైనా మేయర్ పీఠాన్ని కట్టబెడుతుందని నేతలు లెక్కలు వేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ తన పాత వైభవాన్ని కాపాడుకోవడానికి గులాబీ శ్రేణులు చెమటోడ్చాయి. ఎప్పటిలాగే కొన్ని డివిజన్లలో బలమైన ఓటు బ్యాంకుతో ‘కింగ్ మేకర్’గా ఎదగాలని ఎంఐఎం పట్టుదలగా ఉంది.నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఎంఐఎం పాత్ర అత్యంత కీలకం కానుంది. గతంలో మేయర్ ఎన్నికలో ఎంఐఎం మద్దతు కీలకంగా నిలిచిన నేపథ్యంలో, ఈసారి కూడా అదే పునరావృతమవుతుందా? లేక ఏదైనా ఒక పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
