HomeHEALTHబోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందని వైద్యం.. తీరని రోగుల అవస్థలువెంటనే సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం జిల్లా...

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందని వైద్యం.. తీరని రోగుల అవస్థలువెంటనే సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. సరైన వైద్యులు, సిబ్బంది, కనీస సౌకర్యాలు లేక రోగులు అల్లాడుతున్నారు.

ఈ సమస్యలపై సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు ఆధ్వర్యంలో నాయకులు శనివారం ఆసుపత్రిని సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేశారు. ముందుగా వైద్యులతో మాట్లాడి, అనంతరం రోగులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగుపెడితే మెరుగైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చే పేదలు, మధ్యతరగతి రోగులకు నిరాశే మిగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ డాక్టర్లు లేకపోవడంతో పాటు, స్కానింగ్ చేసేందుకు టెక్నీషియన్లు కూడా లేకపోవడం దారుణమన్నారు.

దీంతో గర్భిణీలు, బాలింతలు, ఇతర రోగులు దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ, లక్షల రూపాయలు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఉన్న సిబ్బంది సైతం రోగులకు ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులుగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న సుదర్శన్ రెడ్డి, తన నియోజకవర్గంలోని ఆసుపత్రిని పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిగా ప్రకటించినా కనీసం ఏరియా ఆసుపత్రి స్థాయి సిబ్బందిని కూడా నియమించకపోవడం వెనుక ఉన్న నిర్లక్ష్యం ఎవరిదో చెప్పాలని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఖాళీగా ఉన్న వైద్యులు, టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయాలని, మందులను అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు వేషాల గంగాధర్, జంగం గంగాధర్, నాయకులు రాములు, నాగలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments