HomeDevotionalఆలయ కమిటీల నియామకంపై కొలిక్కిరాని కసరత్తులు! పాతవారికి పొడిగింపా? కొత్తవారికి ఛాన్సా? షబ్బీర్ అలీ, మహేష్...

ఆలయ కమిటీల నియామకంపై కొలిక్కిరాని కసరత్తులు! పాతవారికి పొడిగింపా? కొత్తవారికి ఛాన్సా? షబ్బీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్‌ల మంతనాలు

జిల్లాలోని ప్రముఖ ఆలయ కమిటీల పదవీకాలం ముగియడంతో కొత్త పాలకమండళ్ల నియామకంపై అధికార కాంగ్రెస్ పార్టీలో కసరత్తు ముమ్మరమైంది. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన దేవాలయాల చైర్మన్లు, సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో.. ఆయా స్థానాలను ఎలా భర్తీ చేయాలనే అంశంపై పార్టీ అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది.

ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ సంయుక్తంగా రంగంలోకి దిగి ప్రత్యేక కసరత్తులు చేస్తున్నారు. ఈ కమిటీల్లో పాతవారినే కొనసాగించాలా లేక కొత్తవారికి అవకాశం కల్పించాలా అనే సందిగ్ధతపై ఈ ఇద్దరు నేతలు సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్నారు.

రాష్ట్రంలో పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలోని ద్వితీయ శ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవుల రూపంలో ఆలయ కమిటీల్లో ప్రాధాన్యత దక్కింది. అయితే, ఏడాది తిరక్కుండానే వీరి పదవీకాలం ముగిసిపోవడంతో ఎండోమెంట్స్ శాఖ గడువు ముగింపు నోటీసులు జారీ చేసింది.

దీంతో చైర్మన్లుగా పనిచేసిన నేతలు తీవ్ర అసంతృప్తితోనే బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని జెండా బాలాజీ ఆలయానికి లవంగం ప్రమోద్ కుమార్, శంభుని గుడికి మధు, హమాల్‌వాడి సాయిబాబా ఆలయానికి గంగ కిషన్, కంటేశ్వర్ నీలకంఠేశ్వర ఆలయానికి తిరుపతులను గతంలో చైర్మన్లుగా నియమించారు.

ఇప్పుడు వీరి పదవీకాలం పూర్తి కావడంతో, తమకు కనీసం మరో ఏడాది పొడిగింపు ఇవ్వాలని మాజీ చైర్మన్లు పట్టుబడుతున్నారు. గాంధీ భవన్ వేదికగా, స్థానిక అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గట్టిగానే ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నాయకులు సైతం నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

దీంతో పాతవారిని కొనసాగించాలా.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలా అనే అంశం కీలకంగా మారింది.మరోవైపు ఖాళీ అయిన ఈ ప్రతిష్ఠాత్మక ఆలయ కమిటీ చైర్మన్ పీఠాలను ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీలోని కొందరు కొత్త ఆశావహులు చెమటోడుస్తున్నారు.

ఇప్పటికే తమతమ పలువురు స్థానికంగా చక్రం తిప్పే పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వంటి పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సమీకరణాల్లో కీలకమైన ఈ ఆలయాల కమిటీల్లో తమ అనుచరులకు చోటు దక్కించుకునేందుకు నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల ముఖ్య నేతలు పైరవీలు మొదలుపెట్టారు.

ఒక్కో ఆలయ చైర్మన్ పదవికి ఐదారుగురు బలమైన అభ్యర్థులు రేసులో ఉండటంతో, గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా జాబితాను రూపొందించడం పీసీసీ నేతలకు కత్తిమీద సాములా మారింది.

ఒకరికి ఇస్తే మరొకరు అలకపాన్పు ఎక్కే ప్రమాదం ఉండటంతో, నియామకాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అటు పాతవారి ఒత్తిళ్లు, ఇటు కొత్తవారి ఆశల మధ్య నలుగుతున్న ఆలయ కమిటీల పంచాయితీ.. చివరకు ఎవరికి వరంగా మారుతుందో, ఎవరికి నిరాశ మిగులుస్తుందో సవాలుగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments