HomeTelanganaHyderabadముదిరాజ్‌లకు సామాజిక న్యాయం దిశగా అడుగులు!..బీసీ-ఏలో చేర్పుపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం..న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్ణయం.....

ముదిరాజ్‌లకు సామాజిక న్యాయం దిశగా అడుగులు!..బీసీ-ఏలో చేర్పుపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం..న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్ణయం.. సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలు

ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మార్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రతిపాదనపై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా అధ్యయనం చేసి, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

కులగణనలో సేకరించిన వివరాలను ప్రాతిపదికగా తీసుకుని, సంబంధిత వర్గాలతో చర్చించిన అనంతరం ముదిరాజ్‌లకు న్యాయం జరిగేలా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. నిరుపేదలు, బహుజనుల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్‌ 174వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సాయన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయనపై రూపొందించిన పాటలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముదిరాజ్‌ సామాజికవర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల అంశంతోపాటు బహుజన పోరాటయోధుల చరిత్ర, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో చేర్చే అంశంపై గతంలో సరైన గణాంకాలు లేని కారణంగా న్యాయస్థానాల్లో ప్రతికూలత ఎదురైందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన వివరాలను ప్రాతిపదికగా తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. న్యాయనిపుణులు, అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం సంప్రదింపులు జరిపిన తర్వాత మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చితే గంగపుత్రులకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు, అపోహలు ఉన్నాయని పేర్కొంటూ.. సంబంధిత వర్గాలతో చర్చించి వాటిని నివృత్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు… పండుగ సాయన్న నిరుపేదలు, బహుజనుల హక్కుల కోసం జమీందార్లు, జాగీర్దార్లు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని ముఖ్యమంత్రి కొనియాడారు.

.సర్వాయి పాపన్న గౌడ్‌, జ్యోతీరావు పూలే వంటి మహనీయుల తరహాలోనే పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బహుజనుల కోసం జీవితాలను అంకితం చేసిన పోరాటయోధుల చరిత్రకు తగిన స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేయకుండా మరింత మెరుగ్గా అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే 55 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు..

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండ ప్రకాశ్‌, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఈటల రాజేందర్‌, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments