మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకొని జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ నెల 13న కౌంటింగ్, 16న మేయర్, చైర్పర్సన్ల ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు 163 BNSS (పాత సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
ఈ నిబంధనలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు.అలాగే ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించకూడదు.
బహిరంగ ప్రదేశాల్లో పటాకులు కాల్చడం పూర్తిగా నిషేధించబడింది. కౌంటింగ్ కేంద్రానికి కిలోమీటర్ పరిధిలో లాఠీలు, కర్రలు, జెండాలు లేదా ఆయుధాలుగా ఉపయోగపడే వస్తువులను తీసుకురావడాన్ని నిషేధించారు. ముందస్తు అనుమతి లేకుండా మైకులు వాడటం, రోడ్లపై షామియానాలు వేయడం చట్టరీత్యా నేరం.
వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగాలు చేసినా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటారనీ అన్నారు.
*కౌంటింగ్ కేంద్రాలు ఇవే:*
* ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (నిజామాబాద్)
* విజయమేరి హై స్కూల్ (బోధన్)
* ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్మూర్)
* ప్రభుత్వ జూనియర్ కళాశాల (భీమ్‌గల్)
విధులు నిర్వహించే పోలీసులు, సైనిక బలగాలు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని సీపీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
రేపు నిజామాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..కౌంటింగ్ కేంద్రం వద్ద రద్దీని నివారించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు గాను ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు వాహనాలను వేరే మార్గాల్లో మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.
బస్సుల రాకపోకలు ఇలా..
*హైదరాబాద్, ఆర్మూర్ వైపు నుంచి:* నిజామాబాద్‌కు వచ్చే ఆర్టీసీ మరియు ప్రైవేటు బస్సులు కంటేశ్వర్ బైపాస్, ఖాజా హోటల్ బైపాస్, ఐడీఓసీ, ఖానాపూర్ కాలూర్ జంక్షన్ మీదుగా దుబ్బా చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి శివాజీ విగ్రహం, రైల్వే ఫ్లైఓవర్ మీదుగా బస్టాండ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
*బోధన్, బాన్సువాడ మార్గంలో:*
ఈ వైపు నుంచి వచ్చే వాహనాల రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదు, యథావిధిగా కొనసాగుతాయన్నారు.నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున, ఆ పరిసరాల్లో పాక్షికంగా ఆంక్షలు ఉంటాయి.
అత్యవసరమైతే తప్ప వాహనదారులు పాలిటెక్నిక్ పరిసర మార్గాల్లో రాకుండా, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయానికి వాహనదారులు, ప్రజలు సహకరించాలని ఏసీపీ కోరారు.
