నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పడి ఉన్న ఓ అనాథ వృద్ధుడి ప్రాణాలను కాపాడి నిజామాబాద్ అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు.
ఖాకీ దుస్తుల్లో ఉన్నా కరుడుగట్టని తన సున్నిత మనసుతో ఆయన తీసుకున్న చొరవ స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని అనాథ వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో రోడ్డుపై పడిపోయి ఉన్నాడు.
అర్ధనగ్నంగా, ఒంటిపై గాయాలతో, మలమూత్రాల మధ్య దీనావస్థలో ఉన్న ఆ వృద్ధుడి పరిస్థితిని చూసి అటుగా వెళ్తున్న అడిషనల్ డీసీపీ బస్వరెడ్డి తీవ్రంగా చలించిపోయారు. ఆ వృద్ధుడి శరీరంపై పిడుచలు కట్టుకుపోయి ఉన్న దుస్థితిని గమనించిన ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ‘ఇందూరు యువత’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించారు.
డీసీపీ పిలుపు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఇందూరు యువత ప్రతినిధులు, ఆ వృద్ధుడికి సపర్యలు చేశారు. బస్వరెడ్డి ఆదేశాల మేరకు సదరు వృద్ధుడిని మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా దగ్గరుండి సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ మానవీయ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బస్వరెడ్డితో పాటు నగర ఏసీపీ ప్రకాష్, మూడవ పట్టణ ఎస్సై హరిబాబు, ట్రాఫిక్ ఒకటవ పట్టణ పోలీస్ సిబ్బంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, సభ్యులు దర్శనం రాజు, నయన్ తదితరులు ఉన్నారు.
