Monday, April 20, 2026
HomeTelanganaNizamabadనిజామాబాద్ రూపురేఖలు మారుస్తాం:మేయర్ కూరగాయల ఉమారాణి ధీమా

నిజామాబాద్ రూపురేఖలు మారుస్తాం:మేయర్ కూరగాయల ఉమారాణి ధీమా

నిజామాబాద్ నగర ప్రజల దశాబ్దాల కల అయిన ‘స్మార్ట్ సిటీ’ కల సాకారమే లక్ష్యంగా, రాబోయే ఐదేళ్లలో నగరాన్ని ఒక అద్భుతమైన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని మేయర్ కూరగాయల ఉమారాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమె, నగర అభివృద్ధి ప్రణాళికలు, సవాళ్లు మరియు భవిష్యత్తు కార్యాచరణపై ‘ఇది సంగతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

అనూహ్యంగా లభించిన ఈ బాధ్యతను ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నానని, పదవి కంటే బాధ్యత ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. నగరంలోని మొత్తం 60 డివిజన్లలో ఎటువంటి వివక్ష లేకుండా సమానమైన అభివృద్ధి జరగాలని, ముఖ్యంగా పారిశుధ్యం, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటికీ నల్లా నీరు అందించడం, గుంతలు లేని రోడ్ల నిర్మాణం తన ప్రాథమిక లక్ష్యాలని వివరించారు.

వీటితో పాటు పార్కుల అభివృద్ధి, నగరం సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు.స్మార్ట్ సిటీ హోదా సాధించడంపై స్పందిస్తూ, దీనికోసం కౌన్సిల్‌లో ప్రత్యేకంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లేలా కృషి చేస్తానని తెలిపారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైకుంఠధామాలు, కమ్యూనిటీ హాళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు అంతర్గత రోడ్ల విస్తరణ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని, తాగునీటి ఎద్దడి లేకుండా కొత్త ట్యాంకుల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక ఆసక్తితో ఉన్నారని, ఆయన ఇచ్చిన హామీ మేరకు అదనపు నిధుల కోసం సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి , షబ్బీర్ అలీల సహకారంతో పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం కలిగిస్తామని భరోసా ఇచ్చారు.

ఇక నగర ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ ఇద్దరూ బీజేపీ నేతలే అయినప్పటికీ, అభివృద్ధి విషయంలో రాజకీయం ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలు వేరైనా అందరి లక్ష్యం నిజామాబాద్ అభివృద్ధి మాత్రమేనని, వారితో సమన్వయం చేసుకుంటూ కేంద్ర, రాష్ట్ర నిధుల విషయంలో ముందుకు వెళ్తామని చెప్పారు.

అలాగే, గతంలో ఆగిపోయిన రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణంపై అధికారులతో చర్చించి, కాంట్రాక్టర్ల సమస్యలను లేదా సాంకేతిక కారణాలను పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం పెరిగితేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని గుర్తించిన మేయర్, మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతి వారం డేటా తీసి రికవరీ చేయడంతో పాటు, పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్ల సమన్వయంతో, అనుభవజ్ఞులైన నాయకుల మార్గదర్శకత్వంలో నిజామాబాద్‌ను ఒక ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్ది చూపిస్తానని మేయర్ కూరగాయల ఉమారాణి ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!