నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర కారు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. అతివేగం, అజాగ్రత్త కారణంగా నియంత్రణ తప్పిన కారు కెనాల్‌పై నుంచి దూసుకెళ్లి మూడు పల్టీలు కొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంతానికి చెందిన చింతల శ్రీనివాస్ అనే ఇటుకల బట్టీ వ్యాపారి వద్ద పనిచేసే కార్మికులు, తమ కుటుంబ విషయాలు మాట్లాడుకోవడానికి మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా, డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద మారుతి ఈకో వాహనం (TS 17 K 0762) అదుపు తప్పింది.
డ్రైవర్ అతివేగంగా నడపడంతో వాహనం కెనాల్ పైనుంచి కిందకు పడి మూడు పల్టీలు కొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను వెంటనే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
విషయం తెలిసిన వెంటనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును, దానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కారణమని తేలిందని పేర్కొన్నారు. “రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలి.
ముఖ్యంగా బైపాస్ రోడ్డులో వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితిని మించకూడదు” అని ఆయన హెచ్చరించారు. ఈ పర్యవేక్షణలో డిచ్‌పల్లి ఎస్సై ఎండి ఆరిఫ్, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
